Pakistan: పాకిస్థాన్ లో చైనీయులపై కాల్పులు
- కరాచీలో ఇద్దరు చైనీయులపై దుండగుల కాల్పులు
- కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
- ఈ నెల 14న తొమ్మిది మంది చైనా ఇంజినీర్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు
తన మిత్ర దేశం పాకిస్థాన్ లో చైనాకు ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పాక్ లో ఉంటున్న తమ జాతీయులపై దాడులు జరుగుతుండటం చైనాను కలవరపరుస్తోంది. తాజాగా ఈరోజు ఇద్దరు చైనీయులపై బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం బాధితులిద్దరూ కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రతాబలగాల రక్షణ లేకుండా వారు కరాచీలోని ఇండస్ట్రియల్ కారిడార్ కు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది.
ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కాల్పులకు తామే కారణమని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోలేదు. ఈ ఘటనపై చైనా స్పందిస్తూ, పాక్ భద్రతా వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పింది. పాక్ లోని చైనీయులను, చైనా ఆస్తులను ఆ దేశం రక్షించగలదని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్ వ్యాఖ్యానించారు.
ఈ నెల 14న ఖైబర్ ఫఖ్తూంఖ్వా ప్రావిన్స్ లో చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న వాహనంపై బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది చైనా ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మరువక ముందే ఈరోజు చైనీయులపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.