Raghu Rama Krishna Raju: ఫోన్ వాడకుండానే సందేశాలు పంపగల ఘనుడు సీఐడీ డీజీ సునీల్ కుమార్!: రఘురామకృష్ణ రాజు ఆరోపణలు
- రఘురామ ప్రెస్ మీట్
- తన ఫోన్ నుంచి సునీల్ సందేశాలు పంపారని ఆరోపణ
- సునీల్ టెక్నాలజీ వినియోగిస్తారని వెల్లడి
- భార్యపైనా టెక్నాలజీ వాడారని వ్యాఖ్యలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ప్రత్యర్థులపై ధ్వజమెత్తారు. ఈసారి ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. తన ఫోన్ ను తీసుకున్న సునీల్ కుమార్, ఆ ఫోన్ నుంచి కొందరికి సందేశాలు పంపారని ఆరోపించారు. ఆ ఫోన్ ను వాడకుండానే, దాన్నుంచి మెసేజులు పంపగల ఘనుడు సునీల్ కుమార్ అని వ్యాఖ్యానించారు.
"టెక్నాలజీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోగల ఘనాపాఠి ఈ సునీల్ కుమార్. గతంలో ఆయనకు వివాహం కాగా భార్యతో మనస్పర్ధలు వచ్చాయి. అయితే, భార్య ఉపయోగించే కంప్యూటర్ లోకి ఆమె అనుమతి లేకుండా చొరబడి, ఆ కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారు. ఈ విషయం రికార్డుల్లో కూడా ఉంది. నా ఫోన్ నెంబరును ఉపయోగించి కూడా అదే విధంగా సందేశాలు పంపారు. పీవీ రమేశ్ అప్రమత్తం చేయడంతో నాకా విషయం తెలిసింది.
అప్పట్లో న్యాయమూర్తులపైనా ఓ సాఫ్ట్ వేర్ ను ప్రయోగించారని పత్రికా కథనం వచ్చింది. సునీల్ కుమార్ పెగాసస్ తరహా సాఫ్ట్ వేర్ లు ఉపయోగిస్తూ ఇలాంటి సందేశాలు రూపొందిస్తున్నారు. ఏదైనా దరిద్రమైన పని చేసినా అందంగా చేయాలి... నాకు ఎవరితోనో సంబంధం ఉందని, అవతలి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ సందేశం రూపొందించారు. అది నా అకౌంట్ కాదు, నాకు సంబంధించింది కాదు.
కానీ, దాని ఆధారంగా సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు, ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చినట్టు చెబుతున్నారు. మరి సునీల్ కుమార్ ఫిర్యాదు చేస్తే అది సాక్షికి ఎలా వచ్చింది? పిల్లలను (ఎంపీలు) తీసుకుని ఢిల్లీలో అందరినీ కలుస్తున్న దొంగోడు విజయసాయిరెడ్డికి ఎలా అందింది? అంటే సునీల్ కుమార్, విజయసాయి మిలాఖాత్ అయ్యారని అనుకోవాలా? ఇద్దరూ తోడుదొంగలు అనుకోవాలా?" అంటూ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.