Srisailam: శ్రీశైలంకు భారీగా చేరుతున్న వరద నీరు
- శ్రీశైలం డ్యామ్ కు 3,22,262 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- ప్రస్తుత నీటి మట్టం 874.40 అడుగులు
- 539 అడుగులకు చేరుకున్న నాగార్జునసాగర్ నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద కొనసాగుతోంది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ లకు వరద నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.40 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం డ్యామ్ కు 3,22,262 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
ఇక జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 160.9100 టీఎంసీల నీరు ఉంది. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే జలాశయం కొన్ని రోజుల్లోనే పూర్తిగా నిండిపోతుందని అధికారులు తెలిపారు. ఎడమగట్టు (తెలంగాణ) ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
నాగార్జున సాగర్ కు 18,142 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 539.10 అడుగుల నీరు ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 3.35 లక్షల ఇన్ ఫ్లో ఉంది. వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నారు. జూరాల డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు ఉంది.