Mamata Banerjee: ఢిల్లీలో మమత బిజీబిజీ.. నేడు మోదీతో భేటీ
- సాయంత్రం నాలుగు గంటలకు భేటీ
- కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ సమావేశం
- రేపు రాష్ట్రపతి, సోనియాతో భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె ప్రధానిని కలవనుండడం ఇదే తొలిసారి. సాయంత్రం నాలుగు గంటలకు మోదీతో దీదీ సమావేశమవుతారు. అలాగే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతోనూ ఆమె సమావేశం అవుతారు. వీరిలో కమల్‌నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను సింఘ్వి వంటి వారు ఉన్నారు.
రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీలను కలుస్తారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలని మమత భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ పర్యటన అని చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో విపక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. దీంతో అందరినీ ఒకేసారి కలుసుకునే వీలుంటుందనే మమత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు, రేపు ఆమె బిజీబిజీగా గడపనున్నారు.