Eluru: ఏలూరు మునిసిపల్ ఎన్నికలు.. మృతి చెందిన అభ్యర్థుల గెలుపు
- మార్చిలో ఎన్నికలు.. నిన్న విడుదలైన ఫలితాలు
- కరోనా బారినపడి మృతి చెందిన ఇద్దరు అభ్యర్థులు
- ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో మృతి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగ్గా కోర్టు కేసుల కారణంగా లెక్కింపు వాయిదా పడింది. తాజాగా హైకోర్టు తీర్పుతో నిన్న లెక్కింపు ప్రారంభం కాగా, వైసీపీ ఘన విజయం సాధించింది.
ఇదిలావుంచితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు రెండు నెలల క్రితం కరోనా బారినపడి మృతి చెందారు. వీరిలో 45వ డివిజన్ నుంచి పోటీ చేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058 ఓట్లతో, 46 డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్లతో విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 47 డివిజన్లలో విజయం సాధించిన వైసీపీ నగర పీఠాన్ని దక్కించుకుంది. ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.