India: టోక్యో ఒలింపిక్స్... భారత్ కు మిశ్రమ ఫలితాలు
- వెయిట్ లిఫ్టింగ్ లో రజతం
- బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో సాయిప్రణీత్ ఓటమి
- డబుల్స్ లో సాయిరాజ్, చిరాగ్ జోడీ ముందంజ
- ఆర్చరీ మిక్స్ డ్ ఈవెంట్లో ముగిసిన భారత్ పోరు
- క్వార్టర్ ఫైనల్లో దీపిక, ప్రవీణ్ జోడీ ఓటమి
టోక్యో ఒలింపిక్స్ లో నేడు భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన మీరాబాయి చాను దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. అయితే, ఇతర క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు ఓటమి పాలయ్యారు. బ్యాడ్మింటన్ పురుషుల విభాగం గ్రూప్ దశ మ్యాచ్ లో సాయిప్రణీత్ ఓటమిపాలయ్యాడు. ఇజ్రాయెల్ కు చెందిన జిల్ బర్మన్ మిషా చేతిలో సాయిప్రణీత్ 17-21, 15-21 తేడాతో పరాజయం చవిచూశాడు.
అయితే, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగం గ్రూప్-ఏ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 21-16, 16-21, 27-25తో వరల్డ్ నెం.2 చైనీస్ తైపే జోడీ లీ యాంగ్, వాంగ్ చి లిన్ జోడీపై విజయం సాధించింది.
ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లోనూ భారత బృందానికి చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో భారత్ ఓడిపోయింది. దీపిక కుమారి, ప్రవీణ్ జోడీ 2-6 తేడాతో ఓటమిపాలై సెమీస్ ముంగిట బోల్తాపడింది.
పురుషుల టెన్నిస్ తొలి రౌండ్లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ శుభారంభం చేశాడు. నాగల్ 6-4, 6-7,6-4తో ఉజ్బెకిస్థాన్ ఆటగాడు డెన్నిస్ ఇస్తోమిన్ పై జయభేరి మోగించాడు.