West Bengal: టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్‌గా మమత.. జాతీయ రాజకీయాల్లోకి తొలి అడుగు!

Mamata Banerjee new chairperson of TMC parliamentary party

  • నేడు ఢిల్లీలో పర్యటించనున్న మమత
  • ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలతో భేటీ
  • బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే యత్నం

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతకు ఒక్క రోజు ముందు అంటే నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఆమెను పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ పరిణామంతో ఆమె ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. టీఎంసీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. మమత ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు కానప్పటికీ టీఎంసీ పీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నికకు అర్హులేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

మమత ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకున్న సుదీర్ఘ అనుభవాన్ని అసెంబ్లీతోపాటు, పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్‌గా ఆమె తమకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

నేడు హస్తినలో పర్యటించనున్న మమత వివిధ పార్టీల నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ అవుతారు. కాగా, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని మమత ప్రయత్నిస్తున్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని బీజేపీయేతర పక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని మమత ఇటీవల పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News