Yediyurappa: యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమే: సుబ్రహ్మణ్యస్వామి
- సీఎం పదవి నుంచి యడియూరప్పను తొలగించబోతున్నారని వార్తలు
- కర్ణాటకలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తెచ్చింది యడ్డీ అన్న స్వామి
- 2013లో యడ్డీ దూరమయినందుకే బీజేపీకి అధికారం దక్కలేదని వ్యాఖ్య
కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం పదవి నుంచి యడియూరప్పను తొలగించబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈనెల 26న సీఎం మార్పు ఉండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే యడియూరప్ప కూడా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. తనను సీఎం పదవి నుంచి తొలగించే పక్షంలో తన కుమారుడికి పార్టీలో సరైన స్థానాన్ని కల్పించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానాన్ని హెచ్చరించేలా ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన తొలి నేత యడియూరప్ప అని స్వామి అన్నారు. ఆయన లేనందుకే 2013లో బీజేపీకి అధికారం దక్కలేదని చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే తప్పు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. యడ్డీని తప్పిస్తే బీజేపీకి కష్టమేనని అభిప్రాయపడ్డారు.