Pegasus: ‘పెగాసస్’తో నిఘా పెట్టారని మేం చెప్పలేదు: గూఢచర్యం వివాదంపై ‘ఆమ్నెస్టీ’ వివరణ

Pegasus Issue Has A Turn As Amnesty Clarified On Spying

  • ముప్పుందని మాత్రమే చెప్పామన్న సంస్థ
  • క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్న నంబర్లనే చెప్పామని వెల్లడి
  • ఆ ఫోన్లపై ఎలాంటి గూఢచర్యమూ జరగలేదని క్లారిటీ

పెగాసస్ వివాదం కీలక మలుపు తిరిగింది. కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద హక్కుల కార్యకర్తలతో పాటు ఇతర ప్రముఖుల ఫోన్లలోకి ‘పెగాసస్’ చొరబడిందని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ అనే హక్కుల సంస్థ ఆ వివరాలను బయటపెట్టిందని ఆ మీడియా పేర్కొంది. దీనిపై రెండు రోజులుగా పార్లమెంట్ లో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ వివాదంపై ఆమ్నెస్టీ స్పందించింది. ఇటీవల వెల్లడించిన ఫోన్ నంబర్లను ఎన్.ఎస్.వో తయారు చేసిన పెగాసస్ టార్గెట్ చేసుకుందని తాము చెప్పలేదని స్పష్టం చేసింది. అవి కేవలం ఎన్.ఎస్.వో క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్న నంబర్లు మాత్రమేనంటూ పేర్కొన్నామని స్పష్టం చేసింది. ‘‘లిస్ట్ లోని ఫోన్ నంబర్లపై ఎన్.ఎస్.వో క్లయింట్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మాత్రమే మేం చెప్పాం. అంటే నిఘా పెట్టే అవకాశాలున్నాయని మాత్రమే చెప్పాం తప్ప.. పెగాసస్ తో నిఘా పెట్టారని మేం చెప్పలేదు’’ అని సంస్థ క్లారిటీ ఇచ్చింది.

ఆ ఫోన్ నంబర్లపై ఇప్పటిదాకా ఎలాంటి గూఢచర్యమూ జరగలేదని తేల్చి చెప్పింది. అయితే, ఆ జాబితాలోని అతి కొద్ది మంది ఫోన్లపై మాత్రం నిఘా పెట్టి ఉండొచ్చని తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 50 వేల ఫోన్ నంబర్లకు పెగాసస్ ముప్పు పొంచి ఉందని ఆమ్నెస్టీ, ఫ్రాన్స్ కు చెందిన ఫర్ బిడెన్ స్టోరీస్ అనే సంస్థలు ఇటీవల వెల్లడించాయి. అందులో 300 మంది భారతీయులూ ఉన్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News