Andhra Pradesh: దమ్మాలపాటిపై సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు

AP Govt withdraws petition against Dammalapati

  • గతంలో అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి
  • రాజధాని రాకముందే భూములు కొన్నారని ఆరోపణ
  • ఏసీబీ దర్యాప్తు .. హైకోర్టును ఆశ్రయించిన దమ్మాలపాటి
  • స్టే ఇచ్చిన హైకోర్టు.. సుప్రీంను ఆశ్రయించిన సర్కారు 

అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.

దమ్మాలపాటి నాడు అమరావతిలో రాజధాని వస్తుందన్న సమాచారంతో ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దమ్మాలపాటి కూడా భాగస్వామేనని చెబుతోంది. దీనిపై ఏసీబీ విచారణ షురూ చేయగా, దమ్మాలపాటి హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం తెలిసిందే.

ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడా చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొన్నిరోజుల కిందట కొట్టివేసింది. ఈ క్రమంలో దమ్మాలపాటిపై తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నేడు సుప్రీంకోర్టుకు తెలిపారు.

కాగా, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఇవాళ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం... నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.

Andhra Pradesh
YSRCP
Dammalapati
Petition
Supreme Court
  • Loading...

More Telugu News