Pegasus: ‘పెగాసస్’పై ఫ్రాన్స్ అత్యవసర సమావేశం
- అధికారులకు అధ్యక్షుడు మెక్రాన్ సమాచారం
- అంశాన్ని సీరియస్ గా తీసుకున్న మెక్రాన్
- ఆయన ఫోన్ పైనా దాడి
ఫ్రాన్స్ లోనూ పెగాసస్ నిఘా ఉందన్న కథనాల నేపథ్యంలో.. జాతీయ భద్రతపై ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆయన ఇప్పటికే సమాచారం పంపించారు. ఈ అంశాన్ని మెక్రాన్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధి గేబ్రియల్ అట్టాల్ చెప్పారు. దేశంలో సైబర్ భద్రతపై ఇది అత్యవసర సమావేశమని అన్నారు.
కాగా, మెక్రాన్ ఫోన్ నంబర్లలో ఒకటి పెగాసస్ దాడికి గురైందని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఆయన మంత్రిమండలిలోని కొందరు మంత్రుల వివరాలూ లీకయ్యాయి. మాజీ పర్యావరణ మంత్రి, మెక్రాన్ కు అత్యంత సన్నిహితుడైన ఫ్రాన్ష్ వా డి రూగీ ఫోన్ పై దాడి జరిగినట్టు సైబర్ వర్గాల విశ్లేషణలో తేలింది.
భారత్ లోనూ పెగాసస్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి మంది ఫోన్లు హ్యాక్ అయినట్టు ఆమ్నెస్టీ ద్వారా తెలుస్తోంది. అందులో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలున్నారు.