KTR: పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్.. భారీ స్పందన
- వికలాంగులకు నాలుగు చక్రాల స్కూటర్లు అందజేత కార్యక్రమం
- 100 మందికి అందిస్తానన్న కేటీఆర్
- కేకులు, హోర్డింగ్‌లకు డబ్బులు ఖర్చు పెట్టకూడదని పిలుపు
- 60 వాహనాలు ఇస్తానన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి
- 50 వాహనాలు ఇస్తానన్న బాల్క సుమన్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎల్లుండి పుట్టినరోజు వేడుకను జరుపుకోనున్న నేపథ్యంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ఈ సారి వికలాంగులకు నాలుగు చక్రాల స్కూటర్లు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాను 100 మంది వికలాంగులకు ఈ వాహనాలను అందించనున్నట్లు చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా కేకులు, హోర్డింగ్‌లకు డబ్బులు ఖర్చు పెట్టకూడదని కేటీఆర్ అన్నారు. తనలాగే వికలాంగులకు ఈ వాహనాలు అందించాలని కోరారు. అలాగే, ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ పిలుపునకు భారీగా స్పందన వస్తోంది. తాను 60 వాహనాలు ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అలాగే, తాను 50 వాహనాలు ఇస్తానని ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు.
కాగా, గత ఏడాది కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా 6 అంబులెన్స్‌లను అందించిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 90 అంబులెన్స్‌లను అందజేశారు. ఈ సారి కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా స్కూటర్లను అందించాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పలువురు నేతలు సానుకూలంగా స్పందించారు. కరోనా సమయంలో ఈ అంబులెన్సు వాహనాలు ప్రజలకు ఉపయోగపడ్డాయి.