Yadadri Bhuvanagiri District: హైదరాబాద్ నుంచి వెళుతున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిన వైనం!
![bus accident at katepalli](https://imgd.ap7am.com/thumbnail/cr-20210721tn60f7ba8f91179.jpg)
- డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన ప్రమాదం
- వేరే బస్సులో వెళ్లిన ప్రయాణికులు
- యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి వద్ద ఘటన
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న 40 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి, బస్సును ఆపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి మీదుగా ఈ రోజు ఉదయం ఓ ఆర్టీసీ బస్సు వెళుతోంది.
అదే సమయంలో ఒక్కసారిగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును చాకచక్యంగా ఆపడంతో ప్రమాదం తప్పింది. ఆ బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూర్ బయలుదేరిందని డ్రైవర్ తెలిపాడు. దానికి ఫిట్‌నెస్ లేకపోవడంతోనే చక్రాలు ఊడిపోయాయని చెప్పాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించారు.