Praveen Kumar: ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ప్రవీణ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ
- ఆయన స్థానంలో రొనాల్డ్ రోస్‌కు గురుకులాల బాధ్యతలు
- రాజకీయ పార్టీలకు అమ్ముడుపోనన్న ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గురుకుల బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది.
స్వేరోస్ ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఊషన్న గృహప్రవేశానికి నిన్న హాజరైన ప్రవీణ్ కుమార్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవతను సందర్శించుకున్నారు. అక్కడి నుంచి ఊట్నూరు మండలంలోని లింగోజీ తండా చేరుకుని మాజీ ఐఏఎఎస్ అధికారి తుకారం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే, దంతనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుపోనన్నారు. ఇప్పటికైతే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.