KTR: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేటీఆర్... ఎందుకింత ఆలస్యం అయిందో వివరణ
- ఇవాళ తొలి డోసు వేయించుకున్న కేటీఆర్
- వ్యాక్సిన్ వేసిన నర్సు, డాక్టర్ లకు కృతజ్ఞతలు
- ఏప్రిల్ లో తాను కరోనా బారినపడ్డానని వెల్లడి
- కేంద్రం మార్గదర్శకాలు పాటించి ఇన్నాళ్లూ ఆగానని వివరణ
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి నెలలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే ఇన్నాళ్లూ ఆయన వ్యాక్సిన్ వేయించుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు కేటీఆర్ నేడు బదులిచ్చారు.
"ఇవాళ తొలి డోసు వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేసిన నర్స్ కెరీనా జ్యోతికి, పర్యవేక్షించిన డాక్టర్ శ్రీకృష్ణకు కృతజ్ఞతలు. కరోనాపై పోరాటంలో వైద్య ఆరోగ్యసిబ్బంది సేవలు అమోఘం. ఇక, నేను ఇన్నాళ్ల పాటు ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదు అని అడుగుతున్నవాళ్లకు నా జవాబు ఇదిగో! ఏప్రిల్ నెలలో నేను కరోనా బారినపడ్డాను. కరోనా నయం అయ్యాక 3 నెలల వరకు వ్యాక్సిన్ తీసుకోరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇప్పుడా గడువు పూర్తికావడంతో వ్యాక్సిన్ తీసుకున్నా" అని కేటీఆర్ వివరణ ఇచ్చారు.