Michael Gargiulo: హాలీవుడ్ నటి సహా మరో మహిళను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష
- 2001లో నటి ఆష్లేను దారుణంగా చంపిన మైఖేల్
- 2005లో మరియా బ్రూనో హత్య
- 2008లో మిషెల్లే మర్ఫీ అనే మహిళపై హత్యాయత్నం
హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్ తో పాటు మరో మహిళను హత్య చేసిన కేసుల్లో హాలీవుడ్ రిప్పర్ గా పేరుగాంచిన మైఖేల్ గార్గిలోకి లాస్ ఏంజెలెస్ కోర్టు మరణశిక్షను విధించింది. ఆష్లేను 20 ఏళ్ల క్రితం 2001లో మైఖేల్ హత్య చేశాడు. 22 ఏళ్ల ఆష్లేను ఆమె నివాసంలోనే దారుణంగా పొడిచి హతమార్చాడు. ఆమె శరీరంపై ఏకంగా 47 కత్తి పోట్లు ఉన్నాయి.
వాస్తవానికి హత్యకు గురైన రాత్రి ఆష్లే తన సహనటుడు ఆస్టన్ కుచర్ తో డేట్ కు వెళ్లాల్సి ఉంది. ఆమె ఇంటికి వెళ్లిన కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. దీంతో, కిటికీలో నుంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్టు కనపడింది. రక్తాన్ని చూసి వైన్ పడివుంటుందనుకుని అక్కడి నుంచి కుచర్ వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు ఆమె శవాన్ని ఇంట్లో గుర్తించారు. ఈ కేసులో కుచర్ ముఖ్య సాక్షిగా మారాడు.
2005లో మైఖేల్ మరో మహిళ మరియా బ్రూనో (32)ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2008లో మిషెల్లే మర్ఫీ అనే మహిళను హతమార్చేందుకు యత్నించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి, కత్తితో పాడిచి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుంది. అనంతరం పోలీసులకు మర్ఫీ ఫిర్యాదు చేసింది. మర్ఫీపై దాడి తర్వాత మైఖేల్ పారిపోయినప్పటికీ... ఘటనా స్థలంతో అతని రక్తం ఉండటంతో పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో మైఖేల్ పై రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయి. అయితే కోర్టు విచారణ సందర్భంగా తాను అమాయకుడినని ఆయన చెపుతూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో చివరకు లాస్ ఏంజెలెస్ కోర్టు ఆయనకు మరణశిక్షను విధించింది. అయితే, ఆయనకు విధించిన ఈ శిక్షను అమలుపరిచే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే, 2019 నుంచి కాలిఫోర్నియా రాష్ట్రంలో మరణశిక్షలపై నిషేధం ఉంది. 2006 తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులో కూడా మైఖేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇల్లినాయిస్ లో జరుగుతోంది.