Telangana: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం.. జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత

TPCC Chief Revanth Reddy House Arrested
  • కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణ
  • కోకాపేట భూముల సందర్శన, ధర్నాకు పిలుపు
  • తెల్లవారుజామున 3 గంటల నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రేవంత్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఆయనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తెల్లవారుజామునే చేరుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సందర్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు.
Telangana
Revanth Reddy
Congress
Kokapet

More Telugu News