MANSAS Trust: తమ సమస్యలను అశోక్ గజపతిరాజుకు వివరించిన మాన్సాస్ ట్రస్టు కాలేజీ సిబ్బంది

MANSAS Trust College staff met Ashok Gajapathi

  • మాన్సాస్ ట్రస్టు ఈవోను నిలదీసిన కాలేజీ ఉద్యోగులు
  • జీతాలు చెల్లించాలని డిమాండ్
  • త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానన్న ఈవో
  • అనంతరం అశోక్ గజపతిని కలిసిన ఉద్యోగులు

మాన్సాస్ ట్రస్టు కళాశాల సిబ్బంది ఇవాళ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజును కలిశారు. తమ సమస్యలను ఆయనకు వివరించారు. గత ఏడాది కాలానికి పైగా తమ జీతాలు సరిగా చెల్లించడంలేదని తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే, మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు అసంబద్ధమైన సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో అశోక్ గజపతిరాజు జోక్యం చేసుకోవాలని, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

దీనిపై అశోక్ గజపతిరాజు స్పందించారు. తాను ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినుంచి ఇప్పటివరకు తనను ఈవో కలవలేదని, ఆయన అంత బిజీగా ఉన్నారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఉద్యోగుల పట్ల ట్రస్టు ఈవో వ్యవహార సరళిని అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు. ట్రస్టులో నిధులు ఉన్నప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కరోనా వేళ మానవత్వం చూపించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

అంతకుముందు, మాన్సాస్ ట్రస్టు కాలేజీ సిబ్బంది మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించి, ఈవోని నిలదీసిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని ఈవో హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

MANSAS Trust
College Staff
Ashok Gajapathi Raju
Vijayanagaram District
Andhra Pradesh
  • Loading...

More Telugu News