Somireddy Chandra Mohan Reddy: కేంద్ర ప్రభుత్వం మన నీళ్ల మీద పెత్తనాన్ని చేజిక్కించుకుంది: సోమిరెడ్డి
- తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, బంధుత్వాలు సజీవం
- సీఎంలు మాత్రం మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు
- మన ప్రాజెక్టుల మీదకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ అనుమతి తీసుకోవాలి
- చివరకు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుంది
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడిన నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల పరిధులను ఖరారుచేస్తూ మొన్న అర్ధరాత్రి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ను విడుదల చేసింది. ప్రాజెక్టులతో పాటు విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన నియంత్రణలోకి తెచ్చుకుందంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మండిపడ్డారు.
'తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయి. ఇద్దరు సీఎంల మూర్ఖత్వంతో కేంద్రం మన నీళ్ల మీద పెత్తనం చేజిక్కించుకుంది. మన ప్రాజెక్టుల వద్దకు మన ఇంజనీర్లు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ అనుమతి కావల్సిన దుర్గతి వచ్చింది. చివరకు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుంది' అని సోమిరెడ్డి పేర్కొన్నారు.