Narendra Modi: అవునా.. మరి గంగానదిలో తేలిన శవాల సంగతేంటో?: మోదీపై మండిపడిన దీదీ
- కరోనాను యోగి అద్భుతంగా కట్టడి చేశారంటూ మోదీ ప్రశంసలు
- బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టే ఆ ప్రశంసలన్న మమత
- జులై 15ను మోదీ ఏప్రిల్ 1 అనుకున్నారంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను అద్భుతంగా కట్టడి చేశారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. మోదీ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఎద్దేవా చేశారు.
యోగి ప్రభుత్వం కరోనాను అంత బాగా కట్టడి చేస్తే మరి గంగానదిలో శవాలు ఎందుకు తేలాయని ప్రశ్నించారు. యూపీ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టే అక్కడి ప్రభుత్వానికి మోదీ సర్టిఫికెట్ ఇచ్చేశారని అన్నారు. కొవిడ్ కట్టడిలో తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే యూపీలోలా ఇక్కడ గంగానదిలో శవాలు తేలలేదన్నారు. సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో యూపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మమత విమర్శించారు.
యోగిని మోదీ ప్రశంసించడంపై టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ఒబ్రియాన్ కూడా ఎద్దేవా చేశారు. ఆయన (మోదీ) జులై 15ను ఏప్రిల్ 1గా భావిస్తున్నట్టు ఉన్నారంటూ ట్వీట్ చేశారు.