Madhya Pradesh: బావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు వెళ్లి.. అందులోనే పడిన 15 మంది
- మధ్యప్రదేశ్‌లోని విదిష పట్టణ సమీపంలో ఘటన
- ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
- చిన్నారిని రక్షించే క్రమంలో బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు
- వారి బరువును ఆపలేక కుప్పకూలిన గోడ
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. బావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు వెళ్లి మరో 15 మంది అందులో పడ్డారు. విదిష పట్టణానికి సమీపంలోని గంజ్‌బసోడలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడింది. విషయం తెలిసిన గ్రామస్థులు చిన్నారిని రక్షించేందుకు బావి వద్దకు చేరుకున్నారు. బావి గోడను అనుకుని అందరూ గుమికూడారు. వారందరి బరువుకి బావి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 15మంది బావిలో పడిపోయారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు బావి వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి విశ్వాస్ సారంగ్‌ను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.