Raghu Rama Krishna Raju: వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో... ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సచివాలయం నోటీసులు
- రఘురామపై వైసీపీ ఎంపీల ఫిర్యాదు
- అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు వినతి
- 290 పేజీల సమాచారం అందజేత
- రఘురామతో పాటు ఇద్దరు టీఎంసీ ఎంపీలకూ
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇటీవల స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్, తదితరులు ఇందుకు సంబంధించి 290 పేజీల సమాచారాన్ని ఆయనకు అందజేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా లోక్ సభ స్పీకర్ ను కలిసి అదనపు సమాచారం అందజేశారు.
రఘురామకు త్వరలోనే నోటీసులు అందుతాయని భరత్ అప్పుడే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే, ఇవాళ ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సచివాలయం నోటీసులు పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై ఈ నోటీసులు పంపారు. రఘురామతో పాటు మరో ఇద్దరు టీఎంసీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ లకు కూడా ఇదే తరహా నోటీసులు వెళ్లాయి. ఈ నోటీసులపై 15 రోజుల్లో బదులివ్వాలని లోక్ సభ సచివాలయం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.