Harikesh Meena: ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దు: ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన కేఆర్ఎంబీ
- జలవివాదాలపై దృష్టి సారించిన కేఆర్ఎంబీ
- బోర్డుకు డీపీఆర్ సమర్పించకుండా పనులు చేపట్టవద్దని ఆదేశం
- తెలంగాణ ఈఎన్సీకి కూడా లేఖ
- ఏపీ ఫిర్యాదులపై స్పందించాలని స్పష్టీకరణ
జల వివాదాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ తీవ్రంగా స్పందించింది. తాజాగా, కేఆర్ఎంబీ సభ్యుడు హరికేశ్ మీనా ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులను చేపట్టవద్దని స్పష్టం చేశారు. బోర్డుకు డీపీఆర్ సమర్పించకుండా, ఆమోదం పొందకుండా పనులు చేయవద్దని తేల్చి చెప్పారు.
హరికేశ్ మీనా అటు తెలంగాణ ఈఎన్సీకి కూడా లేఖ రాశారు. చిన్న నీటివనరులకు తెలంగాణ అధిక నీరు తీసుకుంటోందని ఏపీ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తెలంగాణకు 89.15 టీఎంసీలు కేటాయిస్తే 175.54 టీఎంసీలు తీసుకుందని ఆరోపించినట్టు వివరించారు. ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాలను తరలించకుండా చూడాలని ఏపీ కోరిందని తెలిపారు. ఏపీ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని మీనా తెలంగాణను కోరారు.
కాగా, కేఆర్ఎంబీ మరో సభ్యుడు మౌంతాంగ్ ఇవాళ తెలంగాణ జెన్ కో డైరెక్టర్ కు లేఖ రాయడం తెలిసిందే. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల నుంచి జలవిద్యుదుత్పత్తి చేపట్టరాదని తెలంగాణను ఆదేశించారు.