KRMB: విద్యుదుత్పత్తి ఆపేయండి... తెలంగాణ జెన్ కో డైరెక్టర్ కు కేఆర్ఎంబీ లేఖ
- గతంలోనూ లేఖ రాశామన్న కేఆర్ఎంబీ
- తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదని అసంతృప్తి
- సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడి
- ఏపీ ఫిర్యాదులపై స్పందించిన కేఆర్ఎంబీ
తెలుగు రాష్ట్రాల జల, విద్యుచ్ఛక్తి ఉత్పాదన వివాదాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణ జెన్ కో డైరెక్టర్ కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పాదన కోసం నీటి వినియోగాన్ని ఆపేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబీకి పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ స్పందించినట్టు తెలుస్తోంది.
గతంలోనూ తాము ఇదే అంశంలో లేఖలు రాసినా, తెలంగాణ సర్కారు విద్యుదుత్పాన కొనసాగిస్తుండడంతో మరోసారి లేఖ రాస్తున్నామని కేఆర్ఎంబీ పేర్కొంది. ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యుదుత్పాదన చేయడాన్ని బోర్డు తప్పు బట్టింది.