Sania Mirza: టెన్నిస్ భామ సానియా మీర్జాకు దుబాయ్ 'గోల్డెన్ వీసా'

Tennis stas Sanima Mirza gets Dubai Golden Visa

  • సానియాకు అరుదైన గౌరవం
  • పదేళ్లపాటు దుబాయ్ లో నివసించే అవకాశం
  • గతంలో ఈ గౌరవం దక్కించుకున్న షారుఖ్, సంజయ్ దత్
  • సంతోషం వ్యక్తం చేస్తున్న సానియా

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దుబాయ్ 'గోల్డెన్ వీసా' మంజూరైంది. ఈ గౌరవ వీసాతో సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పదేళ్ల పాటు నివసించేందుకు వీలు కలుగుతుంది. సానియా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన తర్వాత దుబాయ్ లో ఉంటోంది. కాగా, భారత్ నుంచి ఈ గౌరవ వీసా అందుకున్నవారిలో సానియా మీర్జా మూడో వ్యక్తి. గతంలో బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ లకు కూడా దుబాయ్ 'గోల్డెన్ వీసా' మంజూరు చేసింది.

తనకు యూఏఈ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కడం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేస్తోంది. మొదటగా తాను దుబాయ్ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సానియా పేర్కొంది. అంతేగాకుండా, దుబాయ్ పౌరసత్వ అధికార యంత్రాంగానికి, దుబాయ్ క్రీడల శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది.

దుబాయ్ తనకు, తన కుటుంబానికి ఎంతో ఆత్మీయ దేశంగా భావిస్తానని సానియా వివరించింది. దుబాయ్ ని తన రెండో ఇల్లుగా భావిస్తానని, అత్యధిక సమయం ఇక్కడే గడిపేందుకు నిశ్చయించుకున్నామని తెలిపింది. భారత్ నుంచి కొద్దిమందికే దక్కిన ఈ అవకాశం తనను కూడా వరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సానియా వెల్లడించింది. త్వరలోనే టెన్నిస్, క్రికెట్ అకాడెమీలు స్థాపించాలన్న తమ ఆకాంక్షలకు ఈ అవకాశం ఎంతో ఉపకరిస్తుందని వివరించింది. సానియా ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతోంది.

Sania Mirza
Golden Visa
Dubai
Honourary Citizenship
UAE
Tennis
Shoaib Malik
India
  • Loading...

More Telugu News