Janasena: సెక్షన్ 66ఏ కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ప్రభుత్వం వేధిస్తోంది
- సెక్షన్ 66ఏను సుప్రీంకోర్టు కొట్టేసింది
- కేసులను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, అభిప్రాయాలను వెల్లడించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను వాడుతోందని మండిపడ్డారు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సెక్షన్ కింద రాష్ట్రంలో నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేస్తూ, ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తే... బాధిత జనసైనికులకు జనసేన అండగా నిలుస్తుందని చెప్పారు. న్యాయ సహాయం అవసరమైన జనసైనికులు జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ (ఫోన్ నంబర్ 9032143697) ను సంప్రదించాలని సూచించారు. sambasivaevana@gmail.com కి మెయిల్ పంపడం ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.