KTR: జల వివాదంపై ఏపీ ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణ వైపే ఉంటుంది: కేటీఆర్
- కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కారు
- స్పందించిన కేటీఆర్
- న్యాయపోరాటంలో గెలుపు తమదేనని ధీమా
- ఏపీ ప్రయత్నాలను అడ్డుకుంటామన్న పల్లా
కృష్ణా జలాల వాడకం అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జల వివాదంపై ఏపీ ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణ వైపే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఏ న్యాయపోరాటంలోనైనా తమదే గెలుపని ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జలవివాదాలపై స్పందించారు.
టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కృష్ణా జలాల అంశంపై స్పందించారు. కృష్ణా నదీ ప్రాజెక్టులపై ఏపీ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని అన్నారు. ఇష్టంవచ్చినట్టు ప్రాజెక్టులు కడుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ నీళ్లు దొంగలించాడని, ఇప్పుడు జగన్ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నాడని పల్లా ఆరోపించారు.