Swetha Reddy: తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల స్కాలర్షిప్ ఆఫర్ చేసిన అమెరికా విద్యాసంస్థ
- లాఫాయేట్ కాలేజీలో డిగ్రీ అడ్మిషన్ పొందిన శ్వేత
- డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయేట్ కాలేజీ ఉపకారవేతనం
- ప్రతి ఏటా ఆరుగురికి అందజేత
- ఈ ఏడాది ఎంపికైన వారిలో శ్వేతారెడ్డికి స్థానం
భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా, తెలంగాణ విద్యార్థిని శ్వేతారెడ్డి ఓ అమెరికా విద్యాసంస్థలో రూ.2 కోట్ల స్కాలర్ షిప్ తో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందడం విశేషం. ఆమెరికాలోని లాఫాయేట్ కళాశాల 17 ఏళ్ల శ్వేతారెడ్డికి ఈ ఆఫర్ ఇచ్చింది. లాఫాయేట్ కళాశాల అత్యుత్తమ విద్యానైపుణ్యాలు ప్రదర్శించే వారికి ప్రతి ఏటా డైయర్ ఫెలోషిప్ పేరిట ఉపకారవేతనం అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఆరుగురు విద్యార్థులను డైయర్ ఫెలోషిప్ కు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో శ్వేతారెడ్డి కూడా ఉంది.
తాను లాఫాయేట్ కాలేజీ స్కాలర్ షిప్ కు ఎంపిక కావడం పట్ల శ్వేతారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తోంది. డెక్స్ టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో పొందిన శిక్షణ తాను స్కాలర్ షిప్ పొందడానికి తోడ్పడిందని వెల్లడించింది. అటు లాఫాయేట్ కాలేజీ కూడా దీనిపై స్పందిస్తూ, శ్వేతారెడ్డి ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపింది.