koushik: కౌశిక్‌రెడ్డికి చెందిన మరో ఆడియో లీక్.. హుజూరాబాద్ ఎన్నిక విషయంలో రేవంత్ పై వ్యాఖ్యలు!
- ఈటల గెలుస్తారని రేవంత్ రెడ్డి అన్నారు
- ఆయనే ఇంత మాట అన్నాక చేసేదేముంటది
- పొన్నం ప్రభాకర్ ను కోవర్టు చేసి అందరినీ రాజేందర్ వద్దకు పంపుతున్నాడు
- నేను ఇటీవల చెప్పిన విషయంలో తప్పేమీ లేదు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న నేపథ్యంలో, ఆ ప్రాంత మాజీ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ టికెట్ తనకే ఖరారైనట్లు ఆయన ఓ కార్యకర్తతో చెప్పడం కలకలం రేపింది.
అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఘటన మరచిపోకముందే కౌశిక్‌రెడ్డికి సంబంధించిన మరో ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఈ సారి ఆయన కాంగ్రెస్ కార్యకర్త మేకల తిరుపతితో ఫోన్ లో సంభాషించినట్లు ఆ ఆడియోను బట్టి తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి నేను కొట్లాడతా అనే ఆలోచన వున్నప్పుడు, కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ ఎలా ఇస్తాడని ఆయన అన్నారు. హుజూరాబాద్‌లో మరోసారి రాజేందర్ గెలుస్తారని ఆయన ఎలా చెబుతాడని అన్నారు. ఎలా పోరాటం చేయాలో దానిపైనే చర్చించుకుందామని, గెలుస్తామా? లేదా? అన్నది ఆ తర్వాతి విషయమని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో గెలుపుపై స్వయాన రేవంత్ రెడ్డే అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.
రాజేందర్ మంచి అభ్యర్థి అని చెప్పిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ను కోవర్టు చేసి అందరినీ రాజేందర్ వద్దకు పంపుతున్నాడని ఆయన అన్నారు. దీంతో తాను ఇప్పుడు ఏమి చేయాలని ఆయన అడిగారు. కాంగ్రెస్ ఇన్‌చార్జిలను నియమించాలని తాను రెండు నెలల నుంచి రోజూ వేడుకుంటున్నప్పటికీ వెయ్యలేదని ఆయన అన్నారు.