WHO: తొలి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మరొకటి వేయించుకోవద్దు: డబ్ల్యూహెచ్‌వో
- ఇప్పటికే రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్న పలు దేశాల అధినేతలు
- డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన
- ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చరిక
- వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్పటివరకు సరైన డేటా అందుబాటులో లేదని వ్యాఖ్య
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. ఈ నేపథ్యంలో మొదటి డోసు ఓ సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేసి రెండో డోసు మరో వ్యాక్సిన్ వేసినా మంచి ఫలితం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాల అధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్నారు.
అయితే, ఈ తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్పటివరకు సరైన డేటా అందుబాటులో లేదని చెప్పారు. అంతేగాక, ప్రజలే సొంతంగా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకరమైన విషయమని తెలిపారు.
కాగా, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి డోసు ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేయించుకుని, రెండో డోసు మాత్రం మోడెర్నా సంస్థకు చెందింది వేయించుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి కూడా వేర్వేరు వ్యాక్సిన్లను వేయించుకుని ఈ విధానాన్ని ప్రోత్సహించారు.
కెనడా, యూకే, యురోపియన్ యూనియన్ లోని పలు దేశాలు, స్పెయిన్, దక్షిణ కొరియా కూడా ఇటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు ఆయా దేశాలు చెప్పాయి.