Red Sandalwood: హోసూరు జిల్లాలో మదనపల్లె పోలీసుల దాడులు.. రూ. 6.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
- కారులో ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
- అతడిచ్చిన సమాచారంతో బొమ్మనహళ్లిలోని గోడౌన్‌పై దాడులు
- 8.4 టన్నుల బరువున్న 243 దుంగలు స్వాధీనం
తమిళనాడులో ఏపీ పోలీసులు రూ. 6.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తమిళనాడులోని హోసూరు జిల్లా బొమ్మనహళ్లిలో దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
మదనపల్లె పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో శనివారం వాహనాల తనిఖీ సందర్భంగా ఓ కారులో ఎర్రచందనం తీసుకెళ్తున్న కన్నదాసన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. హోసూరులోని ఓ గోదాములో ఎ-గ్రేడు దుంగల నిల్వలు ఉన్నట్టు నిందితుడు చెప్పాడు. దీంతో కొందరు పోలీసులు ఆదివారం బెంగళూరులో నిఘా పెట్టారు.
ఈ సందర్భంగా, ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ అయిన ఇమ్రాన్‌ఖాన్ దుంగలను కొని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు బయటపడింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి హోసూరు జిల్లా బొమ్మనహళ్లి శివారులో ఉన్న గోదాముపై దాడిచేసి తనిఖీ చేయగా రూ. 6.3 కోట్ల విలువైన 8.4 టన్నుల బరువున్న 243 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటితోపాటు కార్లు, నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.