Somu Veerraju: పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని అనడం సరికాదు: సోము వీర్రాజు
- పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సోము వీర్రాజు
- నిర్వాసితులకు వెంటనే ప్యాజీకే ఇవ్వాలని డిమాండ్
- ఇప్పటి వరకు కేంద్రం రూ. 11 వేల కోట్లను ఇచ్చిందని వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్టు పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ రోజు పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి ఎల్ఎన్డీ పేట వద్ద నిర్మించిన పునరావాస కాలనీకి వెళ్లారు. అక్కడున్న నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని... కానీ, పోలవరం ప్రాజెక్టును మాత్రం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని అనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లను ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. ఈ నిధుల్లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 11వేల కోట్లు, పునరావాసానికి రూ. 4 వేల కోట్లను ఖర్చు చేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ముంపులో ఉన్న నిర్వాసితులకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి, అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. పోలవరం పర్యటన సందర్భంగా వీర్రాజుతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిశోర్ తదితరులు ఉన్నారు.