Governor: గిరిజనుల సమక్షంలో రెండో డోసు టీకా తీసుకున్న గవర్నర్
- తండాల్లో వ్యాక్సినేషన్ స్లోగా సాగుతోందన్న తమిళిసై
- భయాలను పోగొట్టేందుకే వచ్చానని వెల్లడి
- ప్రస్తుత పరిస్థితుల్లో టీకానే ఆయుధమని కామెంట్
తెలంగాణ గవర్నర్ తమిళిసై గిరిజనులతో కలిసి టీకా తీసుకున్నారు. ఇవ్వాళ ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో గిరిజనుల సమక్షంలో రెండో డోసు తీసుకున్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని, వారిలో భయాలను పోగొట్టేందుకే తాను వారి సమక్షంలో టీకా వేసుకున్నానని చెప్పారు.
తండాల్లో వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆయుధం టీకానే అన్నారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ను తీసుకోవడం గర్వకారణమని, సొంత వ్యాక్సిన్ తో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయని ఆమె అభినందించారు.
గిరిజనుల్లో అవగాహన పెంచడానికి గవర్నర్ వారి సమక్షంలోనే టీకా తీసుకోవడం అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గిరిజన మహిళల్లో ఉన్న భయాలను తొలగించేందుకే ఆమె వచ్చారన్నారు.