Shatrughan Sinha: కాంగ్రెస్‌ను వీడి టీఎంసీ గూటికి చేరబోతున్న శత్రుఘ్నసిన్హా
- ఈ నెల 21న టీఎంసీ తీర్థం పుచ్చుకోనున్న ‘బీహారీ బాబు’
- చివరి దశలో చర్చలు
- త్వరలోనే మమతతో భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా టీఎంసీ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌కు రాంరాం చెప్పబోతున్నట్టు ఆయన సన్నిహితుడొకరు తెలిపారు. ఈ నెల 21న ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. త్వరలోనే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అవుతారని కూడా తెలుస్తోంది.
శత్రుఘ్న సిన్హా ఆమధ్య బీజేపీకి అనుకూలంగా ట్వీట్ చేయడంతో ‘ఘర్ వాపసీ’ ఉంటుందని అందరూ భావించారు. అయితే, టీఎంసీతో ఇటీవల ఆయనకు సాన్నిహిత్యం పెరగడంతో అటువైపు మొగ్గుచూపుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల నాటికి మోదీకి గట్టి పోటీ ఇచ్చే నేతగా మమత ఎదుగుతారని భావిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో చర్చలు చివరి దశలో ఉన్నట్టు టీఎంసీ నేతలు పేర్కొన్నారు.
నటుడు, రాజకీయ నాయకుడైన సిన్హాకు మమతతో తొలి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవ వేడుకల సందర్భంగా సిన్హా తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీని ‘నిజమైన రాయల్ బెంగాల్ టైగర్’ అని ఇటీవల ఈ బీహారీ బాబు ప్రశంసించడాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.