Unity-22: అంతరిక్షానికి పయనమైన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక
- రోదసి యాత్ర చేపట్టిన వర్జిన్ గెలాక్టిక్
- ఆలస్యంగా అంతరిక్ష యాత్ర
- ప్రతికూల వాతావరణమే కారణం
- కొద్దిసేపటి క్రితమే తొలి ఘట్టం పూర్తి
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష యాత్రలో తొలి ఘట్టం పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, ఐదుగురు వ్యోమగాములతో వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌకతో కూడిన వీఎంఎస్ ఈవ్ స్పేస్ క్రాఫ్ట్ నింగికెగిసింది.
వాస్తవానికి ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గంటన్నర పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే న్యూ మెక్సికో నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 సహిత వీఎంఎస్ ఈవ్ రోదసి దిశగా దూసుకెళ్లింది.
ఈ నౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. కాగా, ఆరుగురు వ్యోమగాములు 90 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండి, ఆపై భూమికి తిరిగిరానున్నారు.