V Revathi: బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది, పేదరికం అడ్డొచ్చింది... ఇప్పుడు ఒలింపిక్స్ కు వెళుతోంది!
- భారత ఒలింపిక్స్ బృందంలో రేవతికి స్థానం
- మిక్స్ డ్ రిలే ఈవెంట్ లో పాల్గొంటున్న రేవతి
- నాలుగో తరగతి నుంచి బామ్మ వద్ద పెంపకం
- కాళ్లకు బూట్లు కూడా లేకుండా పరుగు
- ప్రతిభను గుర్తించిన కోచ్ కణ్ణన్
తమిళనాడు అమ్మాయి వి.రేవతి గాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవతి ఇప్పుడు భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొనడం ఒక కారణమైతే, ఆమె నేపథ్యం మరో కారణం. 23 ఏళ్ల రేవతి భారత మిక్స్ డ్ రిలే టీమ్ లో సభ్యురాలు. చిరుతలా పరుగులు తీసే ఈ తమిళమ్మాయి ప్రస్తుతం భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందంలో స్థానం దక్కించుకోవడంతో అందరి దృష్టి రేవతిపై పడింది. ఆమె నేపథ్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆమె నేషనల్ అథ్లెట్ గా ఎదిగిన తీరు పట్ల శభాష్ అంటారు.
రేవతి జాతీయస్థాయి అథ్లెట్ గా ఎదగడం సాధారణ విషయం కాదు. రేవతి మధురై సమీపంలో ఓ గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె నాలుగో తరగతిలో ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆమెను బామ్మ ఆరమ్మాళ్ తమ ఇంటికి తీసుకువచ్చింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నా, రేవతికి క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది. పాఠశాల స్థాయిలోనే ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కనీసం కాళ్లకు బూట్లు కూడా లేకుండా బుల్లెట్ లా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంది.
కోచ్ కణ్ణన్ రేవతిలోని సిసలైన అథ్లెట్ ను పసిగట్టాడు. అప్పటినుంచి దాదాపు ఆమె కుటుంబ బాధ్యతలను తాను స్వీకరించి, రేవతిని నాణ్యమైన అథ్లెట్ గా తీర్చిదిద్దాడు. యూనివర్సిటీ స్థాయిలో రికార్డులు నెలకొల్పిన ఈ తమిళమ్మాయి జాతీయస్థాయిలో 3 పతకాలు సాధించింది. 2019లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో తృటిలో పతకం చేజార్చుకున్న రేవతి నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ కు వెళుతోంది.
భారత్ కు పతకం వచ్చే అవకాశాలున్న క్రీడాంశాల్లో మిక్స్ డ్ రిలే ఈవెంట్ ఒకటి. ఇందులో రేవతి కూడా సభ్యురాలు. రేవతి ప్రదర్శనపై కోచ్, భారత వర్గాలు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తుండడం విశేషం.