Belgium: కరోనాతో బెల్జియం వృద్ధ మహిళ మృతి... జీనోమ్ పరీక్షలో ఆసక్తికర అంశం వెల్లడి
- కరోనా బారినపడిన 90 ఏళ్ల వృద్ధురాలు
- ఆక్సిజన్ స్థాయి పడిపోయి మృతి
- నమూనాలు పరీక్షించిన నిపుణులు
- కరోనా ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకినట్టు నిర్ధారణ
కరోనా మహమ్మారి వేగంగా జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా కరోనా వైరస్ కు బలయ్యారు. యూరప్ దేశం బెల్జియంలోనూ కరోనా వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల బెల్జియంలో 90 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆమెకు ఒకేసారి రెండు వేరియంట్లు సోకాయి.
ఆ వృద్ధురాలి స్వస్థలం ఆల్ట్స్ నగరం. ఒంటరిగా నివసిస్తున్న ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆమె అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని గుర్తించారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన కొన్నిరోజులకే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మరణించింది. అనంతరం ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి వాటికి జీనోమ్ సీక్వెన్సింగ్ జరిపారు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె కరోనా ఆల్ఫా, బీటా వేరియంట్ల బారినపడినట్టు వెల్లడైంది.
వేర్వేరు వ్యక్తుల నుంచి ఆ వృద్ధురాలికి ఆల్ఫా, బీటా వేరియంట్లు సంక్రమించి ఉంటాయని బెల్జియం వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇది అరుదైన కేసు అని వెల్లడించారు. ఒకే వ్యక్తిలో రెండు కరోనా వేరియంట్లు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బ్రెజిల్ లోనూ ఇలాంటి కేసును గుర్తించారు.