Prime Minister: పద్మ అవార్డులకు పేర్లను మీరే నామినేట్ చేయండి: ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- సెప్టెంబర్ 15 వరకు అవకాశం
- ఎంతో మందికి నైపుణ్యం ఉందన్న మోదీ
- వారి గురించి ప్రపంచానికి తెలియాలని కామెంట్
సాధారణంగా పద్మ అవార్డుల కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు.. వివిధ రంగాల్లో విశేష సేవ, కృషి చేసిన వారి పేర్లను కేంద్రానికి పంపుతుంటాయి. అయితే, ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ‘మంచి పనులు చేసిన వారి పేర్లను మీరే చెప్పండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘భారత్ లో ఎంతోమంది నైపుణ్యం కలిగిన వారున్నారు. వారి వారి రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు. అయితే, అలాంటి వారి గురించి మనం ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వారి గురించి మీకేమైనా తెలుసా? మీకు తెలిసిన వారున్నారా? అయితే, వారి పేర్లను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి. సెప్టెంబర్ 15లోపు వారి పేర్లను పంపండి’’ అని ట్వీట్ చేశారు. పీపుల్ పద్మ అంటూ హాష్ ట్యాగ్ తో పేర్లను నామినేట్ చేయాల్సిన వెబ్ సైట్ ను ఆయన పోస్ట్ చేశారు. ఎవరికైనా ఎవరైనా తెలిసుంటే padmaawards.gov.in లో నామినేట్ చేయవచ్చు.