Messi: అర్జెంటీనా టీమ్ సంబరాలు చేసుకుంటుంటే నేమార్ ను ఓదార్చిన మెస్సీ... స్నేహానికి నిదర్శనం ఈ వీడియో!

Winning side Messi consoles his friend Neymar

  • కోపా అమెరికా టోర్నీ విజేత అర్జెంటీనా
  • ఫైనల్లో బ్రెజిల్ పై విజయం
  • హతాశుడైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్
  • నేమార్ ను హత్తుకుని ఊరడించిన మెస్సీ

రెండున్నర దశాబ్దాల తర్వాత కోపా అమెరికా కప్ ను అర్జెంటీనా జట్టు గెలుచుకుంది. అది కూడా చిరకాల ప్రత్యర్థి బ్రెజిల్ ను ఫైనల్లో ఓడించడంతో అర్జెంటీనాలో వరల్డ్ కప్ గెలిచినంతగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ ముగిశాక అర్జెంటీనా టీమ్ పరవళ్లు తొక్కే ఉత్సాహంతో వేడుకలు చేసుకోగా, బ్రెజిల్ ఆటగాళ్లు తీవ్ర నిరాశానిస్పృహలతో కనిపించారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు నేమార్ జూనియర్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా అసలైన స్నేహానికి నిదర్శనం అనిపించే కొన్ని చిరస్మరణీయ క్షణాలు ఆవిష్కృతమయ్యాయి.

కోపా అమెరికా ఫైనల్లో ఓటమి పట్ల తీవ్ర వేదనకు లోనైన తన మిత్రుడు నేమార్ ను అర్జెంటీనా స్టార్ మెస్సీ హత్తుకుని ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్న పిల్లవాడిలా బాధపడుతున్న నేమార్ ను హృదయానికి హత్తుకుని అతని వేదనను తగ్గించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నేమార్, మెస్సీ... ఫుట్ బాల్ ప్రపంచంలో రారాజులు. ఒకరేమో బ్రెజిలియన్, మరొకరేమో అర్జెంటీనా జాతీయుడు. కానీ వీరిద్దరినీ కలిపింది బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్. గతంలో వీరిద్దరూ యూరప్ లీగ్ పోటీల్లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించారు. తమ సాకర్ నైపుణ్యంతో బార్సిలోనా జట్టుకు అనేక విజయాలు అందించారు. ఆ సందర్భంగా ఏర్పడిన చెలిమి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా కోపా అమెరికా టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత తమ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News