Argentina: నెరవేరిన 28 ఏళ్ల అర్జెంటీనా కల.. దేశానికి కోపా కప్‌ను అందించిన మెస్సీ
- ఫైనల్‌లో బ్రెజిల్‌తో హోరాహోరీగా పోరు
- ఏంజెల్ డీ మారియో గోల్‌తో టైటిల్ సొంతం
- అర్జెంటీనాలో మిన్నంటిన సంబరాలు
కోపా అమెరికా 2021 ఫైనల్‌లో అర్జెంటీనా దుమ్మురేపింది. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అతిపెద్ద టోర్నీని కైవసం చేసుకుని రికార్డులకెక్కింది. బ్రెజిల్‌తో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో 1-0 గోల్స్‌తో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్ అర్జెంటీనాను విజేతగా నిలిపింది. ఫలితంగా 15వ సారి కోపా టైటిల్‌ను సొంతం చేసుకుని అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. మెస్సీ కెరియర్‌లో ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం.
దేశానికి అంతర్జాతీయ టైటిల్‌ను తీసుకురావాలన్న మెస్సీ కల ఇన్నాళ్లకు నెరవేరింది. దిగ్గజ ఆటగాడైన డీగో మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్‌ను సాధించలేకపోయింది. 1973లో తొలిసారి అర్జెంటీనా కోపా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1993లో చివరిసారి దక్కించుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ మరోమారు కప్‌ను సొంతం చేసుకుంది. కోపా కప్ సొంతం కావడంతో అర్జెంటీనాలో సంబరాలు మిన్నంటాయి.