Payyavula Keshav: కేంద్రం ఏపీ ఆర్థిక శాఖకు రాసిన మరో లేఖను విడుదల చేసిన పయ్యావుల
- ఏపీ ఆర్థికశాఖ లక్ష్యంగా పయ్యావుల విమర్శల దాడి
- రూ.41 వేల కోట్ల వ్యయానికి లెక్కలు లేవని వెల్లడి
- తాజాగా మరోసారి స్పందించిన పయ్యావుల
- కేంద్రం లేఖకైనా ఏపీ సమాధానం చెప్పాలని వ్యాఖ్యలు
ఏపీ ఆర్థికశాఖలో రూ.41 వేల కోట్ల మేర లెక్కలు లేని వ్యయం జరిగిందని టీడీపీ సీనియర్ నేత, ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తన దాడిని ఆయన మరింత తీవ్రం చేశారు. ఏపీ ఆర్థికశాఖకు కేంద్రం రాసిన మరో లేఖను పయ్యావుల నేడు విడుదల చేశారు. రాష్ట్ర రుణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఆ లేఖ రాసిందని, పరిధికి మించి రూ.17,923 కోట్లు అప్పు చేశారని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని పయ్యావుల వివరించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఈ లేఖతో స్పష్టమైందని అన్నారు. ఈ రుణాలు, కేంద్రం అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సంజాయిషీ కోరడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ స్పందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై తమకు బదులివ్వకపోయినా, కేంద్రానికైనా సమాధానం చెప్పాల్సిందేనని పయ్యావుల వ్యాఖ్యానించారు.