Somu Veerraju: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా: సోము వీర్రాజు
- జలవివాదంపై బీజేపీ రాయలసీమ నేతల భేటీ
- హాజరైన సోము వీర్రాజు తదితరులు
- కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఆరోపణ
- హుజూరాబాద్ ఎన్నిక కోసమేనని వ్యాఖ్య
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై తన బాణీ వినిపించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఓ పెద్ద డ్రామా అని అభివర్ణించారు.
కేసీఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకుందని, అందుకే కావాలని సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రాయలసీమలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల అంశాలపై రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది పోయి వివాదాలు ఎందుకు? అని సీఎం జగన్ కు హితవు పలికారు. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టుల అంశంపై చర్చిస్తామని తెలిపారు.
రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై నేడు కర్నూలులో సీమ బీజేపీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోము వీర్రాజు, ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.