Komatireddy Venkat Reddy: షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి

Komatireddy wishes YS Sharmila

  • ఈ రోజు పార్టీని ప్రారంభిస్తున్న వైయస్ షర్మిల
  • సభకు రావాలని తనకు ఆహ్వానం అందిందన్న కోమటిరెడ్డి
  • వైయస్ గొప్ప నాయకుడని కితాబు

వైయస్ షర్మిల తెలంగాణలో ఈరోజు కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు టీ.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల పార్టీ సభ జరగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి... వైయస్సార్ అభిమానులతో ఆయన కాసేపు ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ సభకు రావాలని తనకు కూడా ఆహ్వానం అందిందని చెప్పారు. వైయస్ గొప్ప నాయకుడని కొనియాడారు. వైయస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి నివాళి అర్పించేందుకు వెళ్తున్నానని చెప్పారు.

మరోవైపు షర్మిల పార్టీకి సంబంధించిన జెండా, షర్మిల ధరించనున్న కండువాలకు పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి చిలుకూరు బలాజీ ఆలయంలో పూజలు చేయించారు. తెలంగాణ పటంలో వైయస్సార్ బొమ్మతో పార్టీ జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంచితే, ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించిన షర్మిల... ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ఆమెకు మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతారు.

అక్కడి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయల్దేరి... పంజాగుట్ట సర్కిల్ లోని వైయస్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. తర్వాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని, పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొంటారు.

Komatireddy Venkat Reddy
Congress
YS Sharmila
  • Loading...

More Telugu News