Umesh Kathi: సీఎం కావాలనే కోరిక నాక్కూడా ఉంది: కర్ణాటక బీజేపీ నేత ఉమేశ్ కత్తి
- సీఎం పదవి కావాలని కోరుకుంటున్న పలువురు కర్ణాటక బీజేపీ నేతలు
- సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయన్న ఉమేశ్ కత్తి
- ఈ టర్మ్ లోనే తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నానని వ్యాఖ్య
కర్ణాటక రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం అక్కడి బీజేపీ ప్రభుత్వానికి యడియూరప్ప నేతృత్వం వహిస్తున్నారు. అయితే, బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు కూడా సీఎం పదవిపై కన్నేశారు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి మాట్లాడుతూ, తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉందని మనసులో మాటను బయటపెట్టారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, సీఎం అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని చెప్పారు.
తనకు అవకాశం వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉమేశ్ కత్తి అన్నారు. ఈ టర్మ్ లోనే తనకు సీఎంగా అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వయసు 60 ఏళ్లని... మరో 15 ఏళ్ల పాటు సీఎం పదవిని అందుకునే, రాష్ట్రాన్ని పాలించే శక్తిసామర్థ్యాలు తనకు ఉన్నాయని చెప్పారు. బాగల్ కోటెలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాగల్ కోటె జిల్లా ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు.