KTR: బాలానగర్ ఫ్లైఓవర్ కు పేరుపెట్టిన కేటీఆర్
- 40 ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
- బాలానగర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం
- ఓ కార్మికురాలితో ప్రారంభోత్సవం
- ఫ్లైఓవర్ కు బాబు జగ్జీవన్ రామ్ పేరు
హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే క్రమంలో ఏర్పాటు చేసిన బాలానగర్ ఫ్లైఓవర్ ను శివమ్మ అనే కార్మికురాలితో కలిసి ప్రారంభించడం ద్వారా మంత్రి కేటీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా ఈ నూతన ఫ్లైఓవర్ కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ అని నామకరణం చేశారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. గత 4 దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రాంత వాసులకు తాజా ఫ్లైఓవర్ పెద్ద ఊరట అని చెప్పాలి.
ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక ద్వారా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోనే రూ.1000 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. త్వరలోనే బాలానగర్ పరిధిలో రోడ్ల విస్తరణ కూడా జరగనుందని పేర్కొన్నారు.