Delhi: ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ.. తెల్లవారుజాము 3 గంటల వరకు బార్లు
- మందు తాగే వయసు 21 ఏళ్లకు తగ్గింపు
- ప్రభుత్వ వైన్ షాపులను ఎత్తివేస్తూ నిర్ణయం
- మైక్రో బ్రూవరీలకు అనుమతి
మందు బాబులకు మంచి కిక్కెక్కించే నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే ఉంటాయి. నిన్నటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం రాష్ట్ర రెవెన్యూకి చాలా ముఖ్యమని ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. అలాగే మందు తాగే వారి కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించింది.
ఈ కొత్త పాలసీలో ప్రభుత్వ రీటెయిల్ వైన్ షాపులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని తయారు చేసింది. అంతేకాదు, వైన్ షాపులు పూర్తి ఎయిర్ కండిషన్ తో, గ్లాస్ డోర్లతో ఉంటాయి. లిక్కర్ కొనుగోలుదారులు షాపుల ఎదుట బారులు తీరకుండా, షాపులోకి వచ్చి వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చు. బీర్ల కోసం మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంటాయి.