Abhijit Mukherjee: టీఎంసీలో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్
- కోల్ కతాలో టీఎంపీ కండువా కప్పుకున్న అభిజిత్
- కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశానని వ్యాఖ్య
- పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానన్న అభిజిత్
పశ్చిమబెంగాల్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మమతా బెనర్జీకి చెందిన టీఎంసీలో చేరారు. కోల్ కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి హోదా ఇవ్వలేదని, అందుకే టీఎంసీలో చేరానని తెలిపారు. పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతను అప్పగించినా ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు.
బెంగాల్ లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్న పార్టీలో పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. బీజేపీ మతతత్వాన్ని మమత విజయవంతంగా అడ్డుకోగలిగారని... ఇదే మాదిరి భవిష్యత్తులో కూడా వివిధ పార్టీలతో కలసి దేశ వ్యాప్తంగా మతతత్వాన్ని ఆమె అడ్డుకోగలరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అభిజిత్ ఎంపీగా పని చేశారు.