Sanjay Raut: మా బంధం అమీర్ ఖాన్, కిరణ్ రావుల బంధం వంటింది: సంజయ్ రౌత్ చమత్కారం
- విడాకులు తీసుకుంటున్నా తమది ఒకటే కుటుంబమన్న అమీర్, కిరణ్ రావు
- శివసేన, బీజేపీలది కూడా అదే అనుబంధమన్న సంజయ్ రౌత్
- సిద్ధాంతాలు వేరైనా.. స్నేహం ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య
పాత మిత్రులు బీజేపీ, శివసేనలు మళ్లీ చేతులు కలపబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివసేన తమకు ఎప్పటికీ శత్రువు కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసి, ఆసక్తిని మరింత పెంచారు.
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని అమీర్, కిరణ్ ల బంధంతో సంజయ్ రౌత్ పోల్చారు. తమ పార్టీలు ఇండియా, పాకిస్థాన్ కాదని ఆయన అన్నారు. తమది అమీర్ ఖాన్, కిరణ్ రావుల మధ్య ఉన్న బంధం వంటిదని... తమ పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చని, కానీ స్నేహం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందని చెప్పారు.
15 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలుకుతున్నట్టు, విడాకులు తీసుకుంటున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పక్కనే కూర్చొని, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఈ ప్రకటన చేశారు. తమది ఎప్పటికీ ఒకటే కుటుంబమని, తమ మధ్య రిలేషన్ షిప్ మాత్రమే మారుతోందని, తాము ఎప్పటికీ ఒకటేనని చెప్పారు. ఇవే వ్యాఖ్యలను సంజయ్ రౌత్ కూడా ఉటంకించారు.