Devendra Fadnavis: శివసేన మాకు ఎప్పుడూ శత్రువు కాదు: దేవేంద్ర ఫడ్నవిస్

Shiv Sena Was Never Our Enemy says Devendra Fadnavis

  • శివసేన, బీజేపీ మళ్లీ కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఫడ్నవిస్ సమాధానం
  • శివసేన తమకు ఎప్పుడూ మిత్రుడే అని వ్యాఖ్య
  • పరిస్థితులను బట్టి రాజకీయాల్లో నిర్ణయాలు ఉంటాయన్న ఫడ్నవిస్

మహారాష్ట్రలో పాత మిత్రులైన బీజేపీ, శివసేనల మధ్య అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు ఈ రెండు పార్టీలు వైరి వర్గాలుగా మారిపోయాయి. చివరకు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శివసేనపై అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అనేక సందర్భాల్లో శివసేనను విమర్శించారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

శివసేన తమకు ఎప్పుడూ శత్రువు కాదని ఫడ్నవిస్ అన్నారు. మాజీ మిత్రులైన బీజేపీ, శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. శివసేన తమకు మిత్రుడేనని ఆయన చెప్పారు. అయితే ఎవరిపైన అయితే గతంలో కలిసి పోరాడామో... ఇప్పుడు వారితోనే కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండదని... పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

ఎన్సీపీకి చెందిన నేతలపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని శివసేన, ఎన్సీపీ వ్యాఖ్యానించాయి. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయనే ప్రచారం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News