Saree: చీర దొంగిలించడానికి కత్తి చూపించాడు... నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు

Police registers case on a saree thief under national security act

  • ఉజ్జయిన్ లో ఘటన
  • ఓ షాపులో ఎర్ర చీర చూసిన పాతనేరస్తుడు 
  • భార్యకు కానుకగా ఇవ్వాలని నిర్ణయం
  • కత్తితో షాపులో వీరంగం
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన వైనం

భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు ఓ పాత నేరస్తుడు చీరను దొంగలించగా, అతడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో జరిగింది. విక్కీ ఓ పాత నేరస్తుడు. అతడిపై చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయి. కాగా, టవర్ చౌక్ లోని ఓ వస్త్ర దుకాణం వద్ద కనిపించిన ఎర్రచీర అతడికి బాగా నచ్చింది. దాన్ని తన భార్యకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, ఆ చీర కొనడానికి బదులుగా తనకు బాగా అలవాటైన మార్గాన్ని ఎంచుకున్నాడు. చీరల దుకాణంలోకి వెళ్లి కత్తితో వీరంగం వేశాడు. అడ్డొచ్చినవారిని పొడుస్తా అంటూ బెదిరించాడు. ఆ సమయంలో షోరూంలో ఎంతో నగదు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా, తాను మెచ్చిన ఎర్రచీరను తీసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఫుటేజిని పరిశీలించిన పోలీసులు ఇది విక్కీ పనితనం అని గుర్తించారు.

అతడిపై గతంలో 16 కేసులు ఉండడంతో, ఈసారి తప్పించుకునే వీల్లేకుండా ఏకంగా జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించడంతో, భార్యకు బహుమతిగా ఇద్దామని చీర దొంగిలించినట్టు వెల్లడించాడు. కాగా, ఓ దొంగపై ఇంత కఠినచట్టం అవసరమా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు మాత్రం అతడి నేరచరిత్ర దృష్ట్యా తమ చర్య సరైనదేనని సమర్థించుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News